సిములేటర్ లాబ్!  ఏమిటి? ఎందుకు? ఎలా?

0
2447

సిములేటర్ లాబొరేటరీ రోగ నిర్ధారణ కోసమో, వ్యాధికి చికిత్స కోసమో మానవ శరీరం లోపలి నిర్మాణాన్ని చూస్తూ, తాకుతూ, అనుభూతి చెందుతూ, అర్ధం చేసుకోగల అద్భుతమైన ఒక వర్చువల్ రియాలిటీ! ఇది రాజమహేంద్రవరంలో జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి నెలకొల్పిన సిములేటర్ లేబొరేటరీ…ఇది సౌత్ ఆసియాలోనే అతిపెద్ద సిములేటర్ లేబొరేటరీ

ఎలక్ట్రానిక్ వైద్య విజ్ఞానం నుంచి పుట్టుకొచ్చిన ఈ నిర్జీవ శరీరాలు ఊపిరి అందనపుడు మనుషులు ఎంతగా గిలగిలలాడిపోతారో చూపిస్తాయి. నొప్పివచ్చినపుడు ఎంతగా విలవిలలాడిపోతారో వివరిస్తాయి. వైద్య విద్యలను నేర్చుకునే వారికీ, నేర్పించే వారికీ ఈ కృత్రిమ మనుషులకు మించిన ఆబ్జెక్టులు లేనే లేవు. 

రోగమూలకమైన శరీర అంతర్భాగాన్ని బాధితుడి లక్షణాలను బట్టి, నిరంతరాయ పరిశీలనలను బట్టి, సృజనాత్మకమైన శాస్త్రీయతను బట్టి, మత్తుమందు లేకుండా, వ్యాధిగ్రస్తుడు బాధతో అరుస్తున్నపుడు సర్జరీ ద్వారా నయం చేసిన ”చరకుడి” అధ్యయనం, పరిశోధన, అన్వేషణ, ఒక కాగడా మరొక కాగడాను వెలిగించినట్టు, పరంపరగా,తరతరాలుగా విస్తరిస్తూ….ఇప్పటికి ఈ గాజు గదంత అపురూపమైన అధ్యయనశాలగా ఎదిగింది.

రోగాలు, వ్యాధులకు మూలాలను నయం చేయగల శస్త్రచికిత్సా పద్ధతులను మెడికోలైనా, డాక్టర్లయినా పేషెంట్లనుంచే అధ్యయనం చెయ్యాలి…మృతదేహాలనుంచే నేర్చుకోవాలి… డిసెక్షన్ లో పదేపదే కోసికోసి శరీర అంతర్భాగాలను పరిశీలించడం చివికి శిధిలమైపోయే శవాలతో సాధ్యం కాదు. జబ్బుని నయం చేసి పంపే రోగి విషయంలో పరిశీలనే తప్ప లోతైన అధ్యయనం కుదరదు. 

ఇలాంటి సవాళ్ళు నిరంతరం ఎదురౌతూనే వున్నాయి. వాటికి  విజనరీల తపన నుంచీ, నిపుణుల అనుభవాల నుంచీ ఎప్పటికప్పుడు పరిష్కారాలు దొరుకుతూనే వున్నాయి. 

…టెక్నిక్ – టెక్నాలజీ – ట్రీట్ మెంట్…ఇదొక ఆగని ప్రవాహం…నిరంతర ప్రయాణం….అందులో సిములేటర్ లాబ్ అతి పెద్దమలుపు…డాక్టర్ గన్ని భాస్కరరావు సృష్టించిన ఈ బెంచ్ మార్క్ కేవలం డబ్బులతో సాధ్యమైన రికార్డు కాదు. ఆయనకు తెలిసో, తెలియకో పాతికేళ్ళకు ముందే ఇందుకు పునాది పడింది. 

శరీరానికి కోతపెట్టకుండా చిన్న రంధ్రం వేసి కెమేరా కంటితో చూస్తూ , చేత్తో తాకకుండా నూడుల్స్ తింటున్నట్టు, ట్రోకార్డులతో సమస్యాత్మకమైన భాగాన్ని చక్కదిద్దడమో, తొలగించడమో చేసే కీహోల్ లేదా లాపరో స్కోపిక్ సర్జరీలో రోగికి వున్న సౌకర్యాన్ని చాలా ముందుగా గుర్తించిన అతి కొద్దమంది భారతదేశపు డాక్డర్లలో గన్ని భాస్కరరావు ఒకరు. ఆయన అమెరికాలో లాపరోస్కోపిక్ సర్జరీలలో శిక్షణ తీసుకున్నపుడే వ్యాధిని గుర్తించి నయం చేయగల ప్రాసెస్ లో మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చే ఏక్యురెసీని, పేషెంటుకి లభించే సౌకర్యాన్ని అవగతం చేసుకున్నారు.

స్కాట్లండ్, నెదర్లాండ్ నుంచి వచ్చిన జెక్ మోవి వంటి సర్జన్లు  జెక్  ”మార్వలెస్, ఇలాంటి లాబ్ ను యూరప్ లో కూడా చూడలేదు అంటున్నారంటే ఆప్రశంసలో  డాక్టర్ గన్ని విజన్ కనబడుతోంది! 

సర్జరీలో డాక్టర్ కంటికి మెదడుకి చేతికి మధ్య వుండే సమన్వయాన్ని సౌండ్ తో సహా ఫీల్ తో సహా సిములేటర్ లేబ్ లోని ప్రతీ మాడ్యూలు లెర్నర్ కి, ట్రెయినర్ కి ఇస్తాయి. 

కారు డ్రయివింగ్ నేర్చకునే పద్ధతుల్ని సర్జరీ నేర్చుకునే పద్ధతులతో పోల్చవచ్చు! క్లచ్, బ్రేకు కాళ్ళకింద వుంచకుని పక్కసీటులో వుండి నేర్చుకుంటున్న మనిషిని కారుతో నేరుగా రోడ్లమీద నడిపించే సాంప్రదాయిక విధానమూ, సీనియర్లు సర్జరీ చేస్తూండగా జూనియర్లు పక్కనే వుండి గమనిస్తూ, ప్రశ్నలు అడుగుతూ సర్జరీ నేర్చుకోవడమూ ఇంచు మించు ఒకటే!

పక్కన ఎవరూ లేకుండా సిములేటర్ కారు మీద డ్రయివ్ చేస్తూ, రోడ్ మీద ఎదురయ్యే సవాళ్ళను సింకర్నైజ్డ్ గా, ఒక ఫీల్ తో అధిగమించే వర్చువల్ లెర్నింగ్, సిములేటర్ లాబ్ లో వర్చువల్ డయాగ్నైజేషన్ తో ట్రీట్ మెంటు ఇవ్వడమూ దాదాపు ఒకటిగా పోల్చవచ్చు. 

సిములేటర్ లేబ్ లో సర్జరీ ప్రాక్టీస్ చేసిన డాక్టర్ లేదా మెడికో కి సాంప్రదాయిక విధానంలో సర్జరీ చేసే లెర్నర్ కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో చాలా తేడా వుంటుంది.

జిఎస్ఎల్ మెడికల్ కాలేజి ఏర్పాటు చేసిన జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ యూరోపియన్ సర్జన్ల అసోసియేషన్ తో, ఆల్ ఇండియా సర్జన్ల అసోసియేషన్ తో నన్నయ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకుని సర్జరీ స్కిల్స్ మీద ట్రెయినింగ్ ఇస్తోంది. ఆన్ లైన్ లో, రియల్ టైమ్ లో దేశవిదేశాల్లోని ధర్డ్ పార్టీలు స్కిల్స్ ని వేలిడేట్ చేస్తున్నాయి. 

కోతపెట్టి అంతర్భాగాలను చక్కదిద్దే సర్జరీల ఫలితాలు, పర్యావసానాలు లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చాక మౌలికంగానే మారిపోయాయి. ఈ మార్పుతో చేసిన సర్జరీలలో సుళువులు, మెళకువలు, సవాళ్ళు, పరిష్కారాలను ఒక సర్జన్ పదిమంది సర్జన్లతో పంచుకునే, పరస్పర అనుభవాలతో అందరూ అప్ డేట్ అవ్వడానికి జిఎస్ ఎల్ స్మార్ట్ లాబ్  గొప్పఅవకాశాన్ని ఇస్తోందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఎండో సర్జన్స్” ప్రసిడెంట్ డాక్టర్ రమేష్ అగర్వాల్ (కోల్ కత్తా) వివరించారు. 

వైద్యవిజ్ఞానాన్ని మరింత లోతుగా అర్ధం చేసుకోడానికి, ఎలక్ట్రానిక్స్, కంప్యూటింగ్ రంగాల్లో వచ్చిన మార్పులు విశేషంగా దోహదపడుతున్నాయి. సిములేటర్ లేబరేటరీ, అనాటమీ ఇమేజ్ వంటి ఆధునిక ఆవిష్కరణలు వైద్యవిజ్ఞానాన్ని నేర్పించడానికి, నేర్చుకోడానికి, ఎవరైనా అధ్యయనం చేయడానికి అంటే మెడికల్ స్టూడెంట్లకు, మెడికల్ టీచర్లకు ఏకకాలంలో ఉపయోగపడుతున్నాయి. 

జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ డైరక్టర్ గా డాక్టర్ సందీప్, కోర్సుడైరక్టర్ గా డాక్టర్ గన్ని భాస్కరరావు, కోర్సు కోఆర్డినేటర్ గా డాక్టర్ సమీర్ రంజన్ నాయక్, చీఫ్ కోఆర్డినేటర్ గా డాక్టర్ వైఎన్ శర్మ మొదలుగా లాబ్ టీమ్ దేశంలో మరెక్కడా లేని సిములేటర్ సర్జరీ స్కిల్స్ ని విస్తరింపచేయడంతో పాటు – రాజమహేంద్రవరాన్ని మెడికల్ టూరిజం స్పాట్ గా కూడా మార్చేస్తున్నారు. 

⁃ పెద్దాడ నవీన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here