కార్డియాక్ అరెస్ట్హార్ట్ అటాక్ మధ్య తేడా!

0
2472

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? ఇది మనిషి శరీరంపై ఇంత భయంకరమైన ప్రభావం ఎలా చూపిస్తుంది? ఇది హార్ట్ ఫెయిల్ కావడం లేదా గుండెపోటు రావడం కంటే ఏ విధంగా భిన్నమైంది?

కార్డియాక్ అరెస్ట్ అనేది ఆకస్మికంగా వస్తుంది. దానికి సంబంధించిన ముందస్తు లక్షణాలు కూడా శరీరంలో ఏమీ కనిపించవు.

సాధారణంగా గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే దీనికి కారణం. ఈ అలజడి ఫలితంగా హృదయ స్పందనలో, అంటే గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతింటుంది. దీని వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. దాంతో మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పోతుంది.కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితిలోకి వెళ్తారు. నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది.

కార్డియాక్ అరెస్ట్‌కు సరైన సమయంలో, సరైన చికిత్స లభించనట్టయితే రోగి కొద్ది సెకన్లలో లేదా నిమిషాల్లో మరణిస్తారు.

కార్డియాక్అరెస్ట్‌తోమరణంఅనివార్యమా?

నిజానికి ప్రతి మరణానికీ చివరి బిందువు కార్డియాక్ అరెస్టేనని చెప్పాలి. అంటే గుండె కొట్టుకోవడం ఆగి పోవడం. ఇదే అంతిమంగా అందరి మరణాలకు కారమవుతుంది.

అయితే కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణం ఏంటి?

గుండెలో ఎలెక్ట్రికల్ సిగ్నల్స్‌లో తలెత్తిన లోపం కారణంగా శరీర భాగాలకు రక్త సరఫరా జరగక పోవడంతో అది కార్డియాక్ అరెస్ట్‌గా మారుతుంది. శరీరం రక్తాన్ని పంప్ చెయ్యడం మానెయ్యగానే మెదడులో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అలా జరిగినప్పుడు మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. శ్వాస ప్రక్రియ ఆగిపోతుంది.

లక్షణాలుఏమిటి?

సమస్య ఏంటంటే, కార్డియాక్ అరెస్ట్‌కు ముందు ఏ విధమైన లక్షణాలూ కనపించవు.

అందువల్లే కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ.

గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడమే దీనికి కారణం. దీనిని వైద్య పరిభాషలో వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటారు.

గుండెకు సంబంధించిన విద్యుత్ కార్యకలాపాలు ఎంతగా అస్తవ్యస్తమవుతాయంటే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఒక విధమైన వణుకు వస్తుంది.

కార్డియాక్ అరెస్ట్ అనేక కారణాల వల్ల రావొచ్చు. అయితే కొన్ని గుండె సంబంధిత వ్యాధుల వల్ల కూడా ఇది వచ్చే అవకాశాలున్నాయి. అవేమిటంటే:

• కరోనరీ గుండె వ్యాధులు

• గుండెపోటు

• కార్డియో మాయోపతీ

• వంశపారంపర్యంగా వచ్చే గుండె వ్యాధులు

• గుండె వాల్వుల్లో ఇబ్బందులు

• గుండె కండరాల్లో వాపు

• లాంగ్ క్యూటీ సిండ్రోమ్ వంటి డిజార్డర్లు

కొన్ని ఇతర కారణాలు

• కరెంట్ షాక్ తగలడం

• ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం

• అధిక రక్తస్రావం కలిగించే హెమరేజెస్

• నీళ్ళల్లో మునిగి పోవటం వంటివి

తప్పించుకోవడంసాధ్యమా?

ఒకసారి కార్డియాక్ అరెస్ట్ జరిగాక రికవర్ కావడం సాధ్యమేనా?

సాధ్యం కావొచ్చు. ఎలా అంటే అనేక సార్లు ఛాతీపైన విద్యుత్ షాక్స్ ఇవ్వాలి. దీనికోసం డిఫిబ్రిలేటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.

సాధారణంగా ఇది అన్ని ఆస్పత్రుల్లోనూ ఉంటుంది. దీనిలో ప్రధాన యంత్రం, షాక్ ఇచ్చే బేస్ ఉంటాయి. దీన్ని ఛాతీపై ఉంచి అరెస్ట్ నుంచి రోగిని కాపాడే ప్రయత్నం చెయ్యొచ్చు.

అయితే కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు దగ్గరలో డిఫిలిబ్రేటర్ లేనట్టయితే ఏం చెయ్యడం?

దీనికి పరిష్కారం CPR. అంటే కార్డియోపల్మోనరీ రెసిసిటేషన్.

దీన్లో రెండు చేతుల్నీ తిన్నగా పెట్టి, రోగి ఛాతీపైన బాగా నొక్కాలి. నోటిలో నోరు పెట్టి గాలిని కూడా ఊదాలి.

హార్ట్ఎటాక్కంటేఇదిఎలాభిన్నమైంది?

చాలామంది కార్డియాక్ అరెస్ట్, గుండె పోటు రెండూ ఒకటే అనుకుంటారు. కానీ రెండింటి మధ్య చాలా తేడా ఉంది.

కరోనరీ రక్తనాళంలో అడ్డంకి లేదా క్లాట్ ఏర్పడినప్పుడు గుండె కండరాల వరకు రక్తం సరఫరాలో ఆటంకం ఏర్పడటంతో గుండె పోటు లేదా హార్ట్ ఎటాక్ వస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు గుండెల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. కానీ కొన్ని సార్లు ఈ లక్షణాలు బలహీనంగా ఉండొచ్చు. అయినా గుండె మాత్రం బాగా బలహీనపడుతుంది. ఇందులో శరీరంలోని మిగతా భాగాలకు గుండె రక్త ప్రసరణ చేస్తూనే ఉంటుంది. రోగి స్పృహలోనే ఉంటారు.

అయితే హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు గుండె తక్షణమే రక్త ప్రసరణను నిలిపివేస్తుంది. అందువల్లనే కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తి తక్షణం స్పృహ కోల్పోతాడు. శ్వాస ప్రక్రియ కూడా నిలిచిపోతుంది.

కారణంఏమైఉండొచ్చు?

డాక్టర్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజి హాస్పిటల్ లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ సత్యేంద్రకుమార్ చెప్పిన వివరాల ప్రకారం, “కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె కొట్టుకోవడం నిలిచిపోవడం. హార్ట్ ఎటాక్ అంటే అర్థం గుండెకు తగిన మోతాదులో రక్తం లభించకపోవడం.”

గుండెకు తగినంత రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ జరగొచ్చు. దీనికి గల అనేక కారణాల్లో హార్ట్ ఎటాక్ కూడా ఒకటి. రక్తం క్లాట్ కావడం కార్డియాక్ అరెస్ట్‌కు కారణం కావొచ్చు. గుండెను ఆనుకొని ఉండే ద్రవాలు దీనికి కారణం కావొచ్చు. గుండె లోపల ఉండే ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఫలితంగా కూడా కార్డియాక్ అరెస్ట్ జరగొచ్చు. ఇంకా అనేక కారణాల వల్ల జరగొచ్చు.”

హార్ట్ఎటాక్‌లోప్రమాదంతక్కువా?

హార్ట్ ఎటాక్‌లో రక్తనాళంలో అడ్డంకి ఏర్పడుతుంది. దీని వల్ల గుండెలోని ఒక భాగానికి ఆక్సిజన్‌తో కూడిన రక్తం అందదు. ఈ అడ్డంకిని వెంటనే తొలగించనట్టయితే, ఈ మార్గం గుండా గుండెలోని ఏ భాగానికి రక్త ప్రసరణ జరగాలో ఆ భాగానికి నష్టం జరగడం మొదలవుతుంది. హార్ట్ ఎటాక్ కేసులలో చికిత్స లభించడంలో ఎంత ఆలస్యమైతే గుండెకూ, శరీరానికి అంత నష్టం జరిగిపోతుంది.

వీటి లక్షణాలు వెంటనే కనిపిస్తాయి. మరి కొన్ని లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి. అంతేకాకుండా, హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత కొద్ది గంటల సేపు లేదా కొన్ని రోజుల పాటు దాని ప్రభావం ఉంటుంది.

ఆకస్మికంగా జరిగే కార్డియాక్ అరెస్ట్‌కు భిన్నంగా, హార్ట్ ఎటాక్‌లో గుండె కొట్టుకోవడం నిలిచిపోదు.

అందుకే కార్డియాక్ అరెస్ట్‌తో పోలిస్తే, హార్ట్ ఎటాక్ కేసులలో రోగిని కాపాడేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే, గుండెకు సంబంధించిన ఈ రెండు వ్యాధులూ పరస్పరం చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. సమస్యేమిటంటే, హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు, అట్లాగే రికవరీ సందర్భంగా కూడా కార్డియాక్ అరెస్ట్ రావొచ్చు. అలాగని హార్ట్ ఎటాక్ వచ్చిన ప్రతిసారీ కార్డియాక్ అరెస్ట్ వస్తుందనేం లేదు. కానీ ఆ ప్రమాదం మాత్రం పొంచి ఉంటుంది.

మరణాలకుఏమేరకుకారణం?

కార్డియోవాస్కులర్ వ్యాధుల మూలంగా ప్రపంచంలో ఏటా 1.7 కోట్ల మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాల్లో ఇవి 30 శాతం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో హెచ్ఐవీ, మలేరియా, టీబీ వ్యాధుల మూలంగా సంభవిస్తున్న మొత్తం మరణాలకు రెట్టింపు సంఖ్యలో ఈ మరణాలున్నాయి.

గుండె సంబంధిత వ్యాధుల ఫలితంగా సంభవిస్తున్న మరణాలలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌తో జరుగుతున్న మరణాలు 40-50 శాతం వరకు ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ కేసులలో ప్రాణాలతో బయటపడే కేసులు ప్రపంచంలో కేవలం ఒక శాతం మాత్రమే కాగా, అమెరికాలో 5 శాతం మంది బయపడగల్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్డియాక్ అరెస్ట్‌ మూలంగా సంభవిస్తున్న మరణాలను బట్టి చూసినప్పుడు ఇదెంత ప్రాణాంతకమైందో తెలుస్తుంది. ప్రస్తుతం దీని కోసం ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించే కృషి జరుగుతోంది.

కార్డియాక్ అరెస్ట్ నుంచి రికవర్ కావడానికి ఉపయోగించే పరికరం సులువుగా లభించదు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి మరింత అద్వాన్నంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here